విభాగము-V             శ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామి వారి జీవిత చరిత్ర
- పావులూరి శ్రీనివాసాచారి


శ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామి

శ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామివారి జీవిత చరిత్ర

ఈ రచనకు ఆధారం శ్రీ స్వర్ణ సుబ్రహ్మణ్యకవి గారి "శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామి వారి మహిమలు".


1) శ్రీ స్వర్ణ అమరలింగేశ్వరులవారి జన్మస్థలము ముప్పవరం అను గ్రామము(ప్రకాశం జిల్లా, పంగులూరు మండలము).


2) ఆ గ్రామములో విశ్వబ్రాహ్మణుడు, అహభూన గోత్రజుడుయైన శ్రీ స్వర్ణ నాగయ్య కు ఆయన థర్మపత్ని ఆంజమ్మ దంపతులకు 1.గురప్ప 2.సుబ్బాబత్తుడు 3.వెంకటశివుడు 4.కోటిలింగం 5.చినసుబ్బాబత్తుడు 6.బుచ్చయ్య 7.శరభలింగం 8.అచ్చయ్య 9.భద్రయ్య అను నామధేయములతో తొమ్మిదిమంది కుమారులు కలరు. వారిలో ఏడవవాడైన శరభలింగముగారికి పేరయ్య,అమరలింగము అను ఇద్దరు పుత్రులు కలిగిరి. వారి మేనమామలు సుపర్ణస గోత్రజులైన మచ్చా వారు.


3) అమరలింగముగారి తల్లి ఆయనకు సుమారు ఐదేండ్ల వయస్సుననే జీవబ్రహ్మైక్యము చెందిన కారణము వలన అమరలింగముగారు వారి మేనమామల వద్ద పెరిగిరి. వారి అన్నయ్య పేరయ్యగారు చదువుకొనుచుండగా అమరలింగముగారు మాత్రము రెండు చిన్న దున్నలను పొలమునకు తోలుకొని వెళ్ళి ఆడుకొనుచుండెడివారు.


4) సుమారు పండ్రెండు సంవత్సరముల వయసులో జగన్మాత సాక్షాత్కారము జరిగినది.


5) ఆ గ్రామములోయున్న ఒక బావి వద్ద తోటి బాలురతో కూడి ఆడుకొనుచూ, ఆ బావిలోకి దుమికి పొడి విభూతి, పసుపు, కుంకుమ తీసుకు వచ్చెదనని పందెము వేసి బావిలోకి దుమికినాడు. ఎంతసేపటికీ పైకి రాకపోవుటచే తోటి పిల్లలు భీతినొంది అమరలింగముగారి మేనమామలకు విషయము చెప్పిరి. అప్పుడు గ్రామప్రజలలో కొందరు వెదురు గడలతో బావిని దేవిచూచి పిల్లవాడు బావిలో లేడనిరి. మా ఎదురుననే అమరలింగము బావిలోకి దుమికినాడని పిల్లలు చెప్పగా, మరలా వెతుకుట ప్రారంభించినారు.


6) ఈలోగా కొందరు ఆ దారిన వెళ్ళుచూ, రామకూరి కొండమీదనున్న శ్రీరామలింగేశ్వరస్వామి వారి గుడిలో ఎవ్వరో చొరబడినారని, తలుపులు తీయగా రావడము లేదనియును చెప్పి వెళ్ళిరి. ఈ విచిత్రమును చూతమని ముప్పవరం గ్రామస్తులు కొందరు రామకూరి కొండవద్దకు బయలుదేరిరి.


7) ఆ కొండ దగ్గరకు అర్చకుడు గ్రామపెద్దలను, కరణమును, మునసబును మొదలగు వారిని కలిసి గుడియొద్దకు చేరునప్పటికి సాయంత్రము ఐదు గంటలయినది తలుపులు పగులగొట్టండి అని అర్చకు డనగానే కరణముగారు మనము వచ్చినది దేవాలయమునకు అంత మూఢత్వముగా మాట్లాడకుమని వారందరు స్వామివారి గుడిచుట్టూ దిరిగి నమస్కరించుచూ స్వామిని ప్రార్ధించి తలుపులు తాకినంతనే ఆ తలుపులు ఱెక్కలు విడిపోయెను.


8) వారందఱాశ్చర్యము చెందిరి. అర్చకు డాకుఱ్ఱవా డెవడో అతనిని లాగివేయండి. దేవునికి నైవేద్యము పెట్టవలెననగా కరణంగారు వెంటనే నైవేద్యమును పెట్టునపుడు నీవు చూడగూడదు. మేము చూడగూడదు. కనుక ఆ ప్రసాదమునకును స్వామివారికిని కలసి వచ్చునటుల ముసుగు వేయమని చెప్పెను. అదియేవిధముగా చెసినంతలో గుడిలో నిశ్చల చిత్తముగా కనులు మూసియున్న ఆ బాలరూపశివుడు హర హర మహాదేవ శంభో అనుచు కన్నులు తెఱచెను.


9) అంతట మునసబుగారు నాయనా మీది యేవూరు? మీ రేవంశమువారు? మీ తల్లిదండ్రులెవ్వరు? అనగా మేము విశ్వబ్రాహ్మణులము. మాది ముప్పవరము. మా తండ్రి శరభయ్య. అనుటలో నాయనా ప్రొద్దుటి నుంచి భోజనము లేకుండ నున్నట్లున్నావు కనుక ఈ గ్రామములో మీ వారున్నారు అచ్చటికిపోదము. కనుక ఈ రాత్రి ఇచ్చటనే మా యింటి వద్దనుంచుకుని తెల్లవారగనే నిన్ను మీ యింటికి పంపుదుమని ఆ రాత్రి భోజనము చేయించి తెల్లవారగనే మొహతాదు నిచ్చి వారి యింటికి పంపిరట. అప్పటినుండి అమరలింగస్వామి గా ప్రసిద్ది చెందినారు. ఈ సంఘటనకు ముందు క్రొద్డ్ది మంది శ్రీ స్వామివారిని పిచ్చి అమరయ్య అని పిలిచెడివారట.


10) అమరలింగస్వామివారిని యింటిలో నుంచి తలుపు వేసి గొళ్ళెము పెట్టినను వెలుపలనున్న జనసముదాయములోనే యుండునట. ఆయన వాహనము ఒకప్పుడు గుఱ్ఱముగాను, మఱియొకప్పుడు కొమ్ములు వచ్చీరాని కోడెదూడగను, ఒక్కొక్కప్పుడు గున్న ఏనుగు వలెను, ఒక్కొక్కసారి సామాన్యపు దున్నపోతుగాను కనిపించుచుండెడిది.


11) ముప్పవరం గ్రామకరణముగారు బహుకాలమునుండి క్షయ వ్యాధితోనుండగా అమరలింగస్వామివారు ఇచ్చిన కొబ్బరి ముక్కల ప్రసాదముతో ఆ వ్యాధి సమూలముగా నశించినది.


12) తాళ్ళూరులో అమరలింగస్వామివారు పదునైదు దినము లుండి తిరిగి వెళ్ళుచూ తొమ్మిది అంగుళముల లావును పదిరెండంగుళముల యెత్తునుకల విభూతి పండు నొసంగి దానికి పూజలుచేసుకొనుడని ఆజ్ఞనొసంగి అప్పుడప్పుడు దర్శనమునిత్తునని అభయమొసంగిరి.


13) చిలుకలూరిపేట దగ్గరయున్న యెడ్లపాడు గ్రామములో కొన్ని దినములు అమరలింగస్వామివారుండినారు. (ఆ ఊరి శివాలయములోని నంది కంట కన్నీరు రావటం ఇటీవలనే జరిగి టీవీలలో కూడా చూపించినారు) ఆ ఊరి బావిలో దూకుట, చూచుచుండగనే ఐదునిముషములలో నాలుగు ఫర్లాంగుల దూరముననున్న మైదవోలు కొండశిఖరముపై కూర్చొని కనిపించెడివాడు.


14) ముప్పవరం గ్రామకరణంగారును రామకూరి కరణంగారును రామకూరు గ్రామమునసబుగారును మొదలగు భక్తులు వారి జీవితాంతమువరకు స్వామివారి అజ్ఞ ప్రకారము ప్రవర్తించుచు వారి వారి గ్రామములయొక్క అభివృద్దులను పొందిరి.


15) గుంటూరుజిల్లా తెనాలి తాలూకా నిడుబ్రోలు గ్రామములో విశ్వబ్రాహ్మణ కుటుంబములో ముంతావారి పుత్రికగా ఈశ్వరమ్మ యనునామె అవతరించి కొంతకాలము అమాయకురాలివలెను, దయ్యము పట్టినదానివలెను, లోకమునకు కనుపించి కొన్నాళ్ళకు రేపల్లె గ్రామములో శ్రీరాజరాజేశ్వరీ మహామంత్రోపాసకుడు కోట వీరభద్రాచార్యులు గారు సుమారు నెలదినము లాయమ్మాయిని పరిశీలించి ఈమె రెండవ ఈశ్వరీదేవిగా ప్రకాశించనున్నదని నిర్ణయించెనట.


16) ఈమె మఠములో తెల్లని సర్పము తిరుగుచు ఎవ్వరిని యేమిచేయక యుండెడిదట. ఆ శేషునకు ఆవుపాలు నిత్యము తెచ్చియిచ్చుచుండెడి భక్తురాలుకూడ కమ్మవారిలో పాములపాటి భగీరధమ్మ యనునామె యుండెడిది. వీరిద్దరు నిడుబ్రోలులోనే కాక పరిసర గ్రామములయందుకూడ ప్రసిద్ది వహించిరి.


17) ఈశ్వరమ్మగారికి శ్రీఅమరలింగస్వామివారు గురువు అయియుండెననియు ఆమె మఠము ముందు ధ్వజమునకు మేలిమి బంగారు రేకుతో స్వామివారు వేసిన యంత్రమును ఇటీవల ఆ స్తంభము శిధిలమైపోగా ఆయంత్రమును కూడ తీసి చూచి దానితో పాటు మరల తొమ్మిదంగుళముల చౌకముగల రాగిరేకు మీద యంత్రమును చెక్కించి యా రెంటిని ధ్వజము క్రింద నుంచిరి.


18) నిడుబ్రోలు గ్రామములో నుండెడి యొక విశ్వబ్రాహ్మణుడు గుత్తికొండ నమశ్శివయ్య అను శిష్యుడు ఈశ్వరమ్మగారి యందు భక్తి యొకవైపునను, ఆమె పుట్టిన వంశమువారు మంచివారుగాదనియు అందువల్ల వారి ఇంటిలో భోజనము చేయగూడదనియు, దాహము సైతము త్రాగగూడదని యొకవైపునను ఇట్టి సంశయముతో నుండెడివాడు. ఆయన రామకూరు కొండమీద తపస్సు చేయుచున్న శ్రీఅమరలింగస్వామివారి దర్శనార్ధమై యచటికి వెళ్ళినాడు.


19) అప్పుడు స్వామివారు ఈ రామకూరు గ్రామములో విశ్వబ్రాహ్మణులున్నారు. అక్కడవారి యిండ్లలో భోజనము చేయుదువా లేక స్వంతముగా వంట చేసికొని తిందువా అని అడుగగా ఇక్కడ యేమున్నవి అనెనట. వెంటనె స్వామివారు ఏమిలేకేమిలే అంటూ కొండ దిగువన నడచిపోవుచున్న యొక కుమ్మరిని పిలిచి ఆ మూటలేమో విప్పి ఆయనకిచ్చి నీ చేతిలోనున్న ఆ విస్తరాకులు ఇచ్చిపో అనగా అతడేమీ మాట్లాడకుండా అలాగే ఇచ్చి నమస్కరించి వెళ్ళినాడు.


20) నమశ్శివయ్య వండుకొని తిని, తిరిగి స్వగ్రామమునకు బయలు దేరుచు స్వామివారితో మనవి చేసినాడు. ఆప్పుడు స్వామివారు నేను శ్రీశైలము తపస్సుకు వెళ్ళుచున్నాను. నా పావుకోళ్ళును, నేను ఉయ్యెల ఊగిన జనుపనార త్రాళ్ళును తీసికొని వెళ్ళి ఈశ్వరమ్మ కిచ్చెదవా అని అడుగగా, నమశ్శివయ్య సరే అని అవి తీసికొని నమస్కరించి బయలుదేరినాడు.


21) నమశ్శివయ్య పొన్నూరు చేరగానే అతని మనస్సులో వున్న వ్యాకులము చెలరేగి ఇప్పుడున్న ఫ్యాక్టరీ ప్రాంతపు మెరక దారిలో వెళ్ళినచో ఈశ్వరమ్మగారి మఠమునకు వెళ్ళవచ్చును. ఆమె నాయనా దాహము పుచ్చుకొనుమని అంటుందేమో ఆమె మాటతీసివేయలేము. త్రాగుట కిష్టము లేదు. కనుక వేరే దారిన బోయితినేని మన యింటికేపోయి అచ్చట కాళ్ళు కడిగికొని దాహము కూడ పుచ్చుకొని మన యింటినుండి ఆమె మఠమునకు వెళ్ళవచ్చునని తలచి ఆ ప్రకారమేచేసెను.


22) యింటినుండి బయలుదేరిన నమశ్శివయ్య మఠమునకు వెళ్ళి స్వామివారిచ్చిన పావుకోళ్ళు, జనుపనార మోకును అమ్మవారికీయబోగా ఆమె నాయనా! నీవు స్వామివారు చెప్పినట్లు నాకు తెచ్చి ఇవ్వలేదుగదా? ఎక్కడుంటే ఏమిలే? నీవే పూజించుచుండుము అన్నది. ఆయన ఈశ్వరమ్మగారి నిష్ఠతో చేయలేకపోగా వారి వంశము నశించిపోయి ఆ పావుకోళ్ళు ఆ త్రాడు ఇప్పటికీ ఆ ఈశ్వరమ్మగారి మఠములోనే యుండి చిరస్థాయిగా పూజించబడుచున్నవి. ఈశ్వరమ్మగారు చెప్పిన కాలజ్ఞానము ఆమె భక్తులలో యెచ్చటనో కలదట.


23) శ్రీఅమరలింగేశ్వరస్వామివారు నిడుబ్రోలునుండి పెదపాలెం చేరుటకు ఆనాడు మెరక దారిగానున్న దొప్పలపుడి, మన్నవ, పాండ్రపాడు గ్రామముల మీదుగా ప్రయాణము కుదిరి వారి యశ్వమునారోహించి వెళ్ళుచుండగా మధ్యస్థమైన మన్నవ వీధిలో గొప్ప గొప్ప మాంత్రికులుండి ఆ పరిసర గ్రామ ప్రజలను పెక్కు రీతులుగా బాధించుచుండిరను వదంతి లోకమున వ్యాపించి యున్నదట. స్వామి వారా మన్నవ ప్రధాన వీధిలో గుంపుగానున్న భూతవైద్యుల నడుమను తన గుఱ్ఱమును పరుగెత్తించిరట కాని ఒక్కరికైన దెబ్బ తగిలినట్లులేదు.


24) ఈ కట్టుబోతులలో కొందరు ఎవరయ్యా ఈయన మహా అదిరిపాటుగా పోవుచున్నాడనిరి. వారి వెనుకనున్న భక్తులగు గోనుగుంట పున్నయ్య, బసవయ్య అను భక్తులు వచ్చుచుండగా ఆ కట్టుబోతులు మరల వీరినడిగిరట. వీరు అన్నదమ్ములిద్దరును, వారు అమరలింగస్వామివారని చెప్పిరట. ఆ స్వామివారు పెదపాలెములో గోనుగుంట పున్నయ్యగారి ఇంటికి వచ్చిరట. ఆ సాయంసమయమున వారి ఇంటి ముందు యేకాండపు తలుపును బోర్లించి స్వామివారిని అందాసీనులం జేసి యా ప్రక్కనే భక్తులిద్దరును కూర్చుండిరి.


25) పెదపాలెములోని యొక రైతు స్వామివారి యొద్దకు వచ్చి వీరెవరని యడుగగా వీరు అమరలింగస్వామి వారని చెప్పినంతలో ఓహో రామకూరికొండ మీద రామలింగేశ్వరస్వామివారి గుడిలో తలుపులు రాలేదనుకున్నారే వారేనా వీరు అనెనట. ఆ మాటలే మీకు చెప్పుటకు వచ్చినాను అనిరట. అక్కడనుండి కొల్లిమర్ల వెళ్ళుచున్నానని చెప్పినారట.


26) శ్రీ అమరలింగస్వామివారి పావుకోళ్ళూ, ఊయెల త్రాళ్ళును పరుచూరు గ్రామములో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయములోను, ముప్పవరము గ్రామములో గోనుగుంట రత్తమ్మ గారి వద్దను, మచ్చా నాగబ్రహ్మాచారి గారి వద్దను, చీరాల-పేరాలలో ఈ 'పఞ్చమహాకాలజ్ఞానములు' రచయితయైన పావులూరి శ్రీనివాసాచారి వద్ద పావుకోళ్ళు, కాలజ్ఞాన తాళప్రతులు యుండి నేటికినీ పూజింప బడుచునే యున్నవి.


27) శ్రీ అమరలింగేశ్వరస్వామివారు యాగంటికొండ మీద ఉన్న గుహలో కొంతకాలము తపస్సు చేసినట్లును, అచటి శివాలయము ముందరి నందీశ్వరమండపము లోని నందిపై నెక్కి కూర్చుండి కాలజ్ఞానము చెప్పుచూ ఎడనెడ వింటివటే పార్వతీ! అనుచూ వ్రాయబడిన కాలజ్ఞానము నేటికినీ లభ్యము.


28) వారు తపస్సు చేసిన గుహలో ముఖము దగ్గరనే రాతిపై యొక సర్పమును, లోపల నొక రాతిపై మరియొక సర్పమును, అచటి కావలి బంట్లవలె మానవులకు దర్శనమిచ్చుచూ నమస్కరించిన వారికి దయజూపి మార్గమిచ్చుచున్నవని ప్రతీతి.


29) శ్రీఅమరలింగస్వామివారు రామకూరికొండనుండి శ్రీశైలము వెళ్ళుచున్నానని తన అన్నగారితో చెప్పగానే నేను కూడా నీ వెంట వచ్చెదనని కొంత దూరము పోగానే అంతర్థాన మయ్యేప్పటికి గుర్తు తెలియక యెంతయో విచారపడి వెనుకకు తిరిగి యింటికి వచ్చి వారి మేనమామలతో చెప్పగా వారుకూడ పరమేశ్వరుడు అవతారమెత్తి మన యింట బిడ్డగా ప్రవర్తించి నందున మన పుణ్యమెంతయో చెప్పజాలము అని నిత్యము విడువక స్వామివారిని పూజించుచుండిరి.ఈ పై రచనకు ఆధారం శ్రీ స్వర్ణ సుబ్రహ్మణ్యకవి గారి "శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామి వారి మహిమలు". వారికి నా పాదాభివందనములు. ఈ క్రింది రచన నా స్వంతంశ్రీ అమరలింగేశ్వర స్వామి వారు ఇప్పటికీ శ్రీశైలములో తపస్సులో యుండి, బదరికావనము, ఆయా పరిసర ప్రాంతములలో భక్తులకు సజీవముగా దర్శనమిచ్చుచున్నారు.నివేదన
ఈ గ్రంథంలో మీకు ఏదైనా బాగుందనిపిస్తే అది నా గురుదేవుల అనుగ్రహం. తక్కిన దోషాలన్నీ నావి. చేతగానితనమంతా నాది.

పావులూరి శ్రీనివాసాచారి


సశేషం© All Rights Reserved         Last Updated::