విభాగము-II         శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామి(సింహాద్రి విశ్వనాథాచారి)వారి కాలజ్ఞానము
-పావులూరి శ్రీనివాసాచారి

swamy
శ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామి


శ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారి కాలజ్ఞానము


విభాగము-1

క్రీ.శ.1794 సంవత్సరము, పాలకొండ(శ్రీకాకుళం జిల్లా) లో జన్మించిన శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామి వారు ఇప్పుడు శ్రీశైలంలోని బదరికావనము వద్ద తపస్సులో యున్నారు. ఆర్తితో పిలిచిన వారికి దర్శనమిచ్చి అభయమిచ్చుట ఆయన భక్తులకు అనుభవమే. మరియూ ప్రతి శుక్రవారము అన్నపూర్ణా సమేతులై పాలకొండలోని దేవాలయమును దర్శించుచూ యున్నారు.


నా గురుదేవులైన శ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామి వారి వద్దనుండి వారు రచించిన కాలజ్ఞానమును ఖచ్చితమైన తేదీలతో త్వరలో తెలియపరచగలను

పావులూరి శ్రీనివాసాచారి
విభాగము-2

ఈ క్రింది మన్త్రములు నా గురుదేవులైన శ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామి వారి వద్దనుండి ఉపదేశము పొంది వారి అనుమతితో ప్రజలకు ఉపయొగపడతాయని ఇచ్చుచున్నాను.

శ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారి మన్త్రము

ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ:
సౌ: క్లీం ఐం శ్రీం హ్రీం ఓం
శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామినే నమ:


శ్రీశ్రీశ్రీ సనారీవిశ్వేశ్వర విరచిత మన్త్రములు
ఈ క్రింది మన్త్రములు చదివి జాతాశౌచ మృతాశౌచములనుండి విముక్తి పొందవచ్చు.
జాతాశౌచ:
జన్మదోషవినాశాయ,జయదేవీమహోజ్వలీం,రేతోగతం ధాతునాడీ,గ్రంధీమలవిశోధినీం,
జన్మదోషవినాశాయ,జన్మజన్మార్జితంసదా,అనంతజన్మసంపాద్యమ్,జాతాశౌచంవిమోచనమ్
పవిత్రంచాపవిత్రంచ, పార్వతీం పరమపావనీం, భక్తాభీష్ట ఫలం దేహిదేహి నమోనమ:
మృతాశౌచ:
మృతాశౌచవిముక్తాయ,ముగ్ధాక్షి ప్రప్రసాదినీం, సర్వేకాలేశు చిర్నిత్యం, సర్వదోషనివారిణీం
ప్రేతేశుచి: స్కలనశుచి: వర్ణోఛ్ఛారణ శ్రావణం, ఘ్రాణాగ్రస్థం సమస్థంవా, మృతాశౌచనివారణమ్


శ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వర విరచిత మహాభైరవ మన్త్రము
ఓం భంభంభం మహాభైరవా ప్రలమ్బమాన జిహ్వాడంబర మహోగ్ర దంష్ట్ర స్వరూపాయ పఞ్చానన కోటి పరాక్రమాయ ఊర్ధ్వవాలాగచరమయాయ సర్వ శతృ సంహారణాయమాం రక్ష రక్ష.
ఈ మన్త్రమును శని దోష నివారణకై, అపమృత్యు గండములనుండి తప్పించుకొనుటకై చదువుకొనగలరు. నైవేద్యముగా ద్రాక్ష పెట్టవలెను. ఈ మన్త్రమును చదువుతున్నంత కాలము మల్లెపూలు ధరించటంగాని, భైరవులవారికి సమర్పించటంగాని నిషిధ్ధము.


ప్రతి వ్యక్తి జాతకంలోనూ ఉండే జన్మలగ్న, తిథి,వార, నక్షత్ర, కరణ, యోగ దోషాలు, గ్రహశాపములు ఈ క్రింది, శ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వర విరచిత, మన్త్రములు చదివి ఉపశమును పొందవచ్చు.

బ్రహ్మ శాపవిమోచన మన్త్రము
ఓం బాం బీం బూం బేం బైం బౌం బ: బ్రహ్మ శాపవిమోచనాయ అమృతస్థాపయస్థాపయస్వా:

విష్ణు శాపవిమోచన మన్త్రము
ఓం వాం వీం వూం వేం వైం వౌం వ: విష్ణు శాపవిమోచనాయ అమృతస్థాపయస్థాపయస్వా:

రుద్ర శాపవిమోచన మన్త్రము
ఓం రాం రీం రూం రేం రైం రౌం ర: రుద్ర శాపవిమోచనాయ అమృతస్థాపయస్థాపయస్వా:

కృష్ణ శాపవిమోచన మన్త్రము
ఓం క్రాం క్రీం క్రూం క్రేం క్రైం క్రౌం క్ర: కృష్ణ శాపవిమోచనాయ అమృతస్థాపయస్థాపయస్వా:

శుక్ర శాపవిమోచన మన్త్రము
ఓం శాం శీం శూం శేం శైం శౌం శ: శుక్ర శాపవిమోచనాయ అమృతస్థాపయస్థాపయస్వా:

త్రిపురసుందరీ శాపవిమోచన మన్త్రము
ఓం ఐం క్లీం సౌ: సౌ: క్లీం ఐం ఓం, ఓం మాం మీం మూం మేం మైం మౌం మ: త్రిపురసుందరీ శాపవిమోచనాయ అమృతస్థాపయస్థాపయస్వా:


వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ది, కుటుంబ సౌఖ్యమ్, శుభకార్యాలు, ఆర్ధిక సదుపాయం, గౌరవమన్ననలు, రత్నభూషణ ప్రాప్తి, పలుకుబడి; అనారోగ్యమ్ కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడప్పుడు మనోక్లేశమ్, కుటుంబ సమస్యలు. దుర్గాజపమ్ లేదా కనకదుర్గ దర్శనమ్ లేదా నవనాగులు మన్త్రమ్ రోజుకు తొమ్మిది సార్లు జపించాలి.

నవనాగుల మన్త్రము

అనన్తమ్ వాసుకిం శేషమ్ పద్మనాభమ్ కంబళమ్
శంఖపాలమ్ ధృతరాష్ట్రంచ తక్షకమ్ కాళీయమ్ తధా
ఏతాని నవనామాని నాగానంచ మహాత్మనే
సాయంకాలే పఠేన్నిత్యమ్ ప్రాత:కాలే విశేషత:
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్


విశ్వకర్మ మన్త్రము

ఓమ్ విశ్వకర్మా దిశాంపతిస్సనహ
పశూన్పాతు సోస్మాన్పాతు తస్మైనమహ
ప్రజాపతీ రుద్రో వరుణోగ్నిర్దిశాంపతిస్సనహ
పశూన్పాతు సోస్మాన్పాతు తస్మైనమహవిభాగము-3

శ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారి కాలజ్ఞానము

ఈ రచనకు ఆధారం శ్రీ స్వర్ణ సుబ్రహ్మణ్యకవి గారి "శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామి వారి మహిమలు".


భూమి నిస్సారమై పైరులు పెరిగినను పంటలు పండకుండును. మహావృక్షములు సైతము పూత పూసి కాయకుండును. పశు పక్షి మృగ జలచరములు మున్నగు నానా విధములగు జీవులు నశించును. తల్లిబిడ్డలకును భార్యాభర్తలుకును ద్వేషములు పుట్టేను. అట్టి ద్వేషములతొ చాలామంది నశింతురు. మానవులకు మితి తప్పిన ఆశలు పుట్టి ఒకరినొకరు మోసగించుట, కలహించుట, దొంగిలించుట, నిందించుట మున్నగు క్రూరకార్యములు ప్రబలమయ్యేను.


వావివరుసలు, నీతినియమములు, కులబేధములు, దేశబేధములు, దైవభక్తి మున్నగు సద్విషయములను పాటించక, మద్యపానము, జూదము, వ్యాజ్యము, కలహము, అసూయ, మత్సరము మున్నగునవి స్వయముగా పెంపుచేసుకొని యా మూలమున చాలామంది నశింతురు. ముండలు, ముత్తైదువలు, కుటుంబినులు, వ్యభిచారిణులు, దొంగలు, మోసకత్తెలు అని గుర్తు తెలియకుండ స్త్రీలు ప్రవర్తింతురు. స్త్రీలకు అధికారములు పెరిగి పురుషులను హీనులుగా జూతురు.


అల్పజాతులని నిందింపబడు వారలెల్ల దొరలై గొప్ప స్థానములలో నుండి ఉత్తమజాతుల వారిపై పెత్తనములు చేయుచుందురు. అంటరానివాడు, చెప్పరానివాడు అని పూర్వము పిలువబడినవాడు వేదములను చదివి మునుపు వేదములు మేము చదివినామను వారలను దూషింతురు. గొప్పవారమనుకొనుచున్న హీనులకు సేవకులై జీవింతురు.


పాడిపంటలు స్వల్పమై తుదకు ప్రజలు, పశువులు, మృగములు సైతము ఆకాశమువంక చూచి ఏడ్చెదరు. సజ్జనులపై నిందలు మోపి అవమానించుచు నానావిధములుగా వారిని బాధపెట్టుదురు. దుర్మార్గులు సంఖ్యలుగా నుండి ఏ చెడ్డ కార్యమైనను నిముషములో చేసి నవ్వుచుందురు. దుర్జనులను దండించువారు లోకమున నుండరు.


వృధ్ధురాండ్రైన స్త్రీలు బిడ్డలను కందురు. ఒక్కొక్కరు దినమునకొక భర్తను మార్చే శక్తి కలవారగుదురు. స్త్రీల పెత్తనమే పురుషుల పెత్తనముకంటె లోకమున న్యాయము కలదిగానుండును. పురుషులకంటె స్త్రీలే విద్యాధికులై యుందురు. సృష్టియందే పురుషులకంటె స్త్రీలధికమగుదురు.


నూటయెనిమిది దివ్యక్షేత్రములు పాడుబడును. కొండలు బ్రద్దలగునట్లు పిడుగులు పడుట, భూకంపములు కలిగి కొండలు సైతము జలమయమగుట, మానవులకు, పశువులకు, అడవిమృగములకు మహాకష్టములు కలిగి నశింతురు. ప్రళయమున సంభవించిన ప్రదేశము చూచినవారికి పూర్వమున్నదానిలో పదియవవంతుగాని తొమ్మిదవవంతుగాని కనిపించుట దుర్లభమగును.


పెద్ద పెద్ద పట్టణములలోనివారి వసతులు చెడి యెచ్చటికో చేరి పట్టెడన్నము దొరకక స్థిమితముగా నుండు తావు దొరకక ధనము మాయమై అకస్మాత్తుగా వచ్చిన దరిద్ర దు:ఖము ననుభవించుట ప్రజలు చూచేరు. దేవాలయములందలి విగ్రహము లొక్కొక్క చోట నాట్యము చేయుట, ఒక్కొక్క శక్తి మానవరూపముతొ సంచరించుచు మనుష్యులతో మాట్లాడుచు తిరిగి జననాశ మొనర్చుట, చిత్ర విచిత్రమైన రోగములు కలిగి యెక్కడివారక్కడనే చత్తురు. రోగములకు మందులు తెలియకుండు నట్టి విచిత్ర వ్యాధులు లోకమంతయు వ్యాపించుట జరుగును.


సముద్రమునుండి ఉప్పెనలు గుర్తు తెలియకుండ వచ్చును. లోకమున వృక్షజాతి నామమాత్రముగానైన కనులకు కానరాకుండును. పశువుల పాడి త్రాగి వానిని వెంటనే చంపువారధిక సంఖ్యాకులగుదురు.


భార్యకును భర్తకును చిన్న సంశయము కలిగి అదియే పెద్దదియై ఒకరికొకరు సంబంధము లేకుండా దూరదేశముల పాలగుట, తల్లికి తండ్రికి సంబంధము లేక తిరుగుచుండు బాలబాలికలు ప్రభుత్వ పొషణమున కెదురు చూచినను రక్షకులు లేక కొందఱు నశింతురు. కొందఱు నిస్సహాయ జీవులతొ లోకము నిండియుండుట మున్నగునవి జరుగును.


మానవులందఱును, మృగజాతులు, పక్షిజాతులును, వృక్షజాతులును, పర్వతములును, భూమియును మరియు విశ్వబ్రహ్మసంభూత కులంబులగు దేవతా సముదాయంబును, నిస్సారములై రుచి తప్పి పొవుటయేకాక బలహీనంబులగును. అటులే భూత గణంబులును అల్పమగును. దురూహలు కలుగును. సత్యము తగ్గిపోవును. అశాపాశబధ్ధ మానసులై సంతోష హీనముతో నశించుచుందురు. జార, చోర, కలుష విశ్వాసద్రోహ మిత్రద్రోహ కృతఘ్నాది కార్యములతో నశించుచుందురు.


గురువులు, దేవతలు, రాజులు శాసనములు కఠినముగా చేయుచుందురు. శక్తులు చండప్రచండరీతులతో సంచరించుచూ, సంభాషించుచు, దుష్టులను పలు రీతుల మారణము చేయుచుందురు. మానవులలో యెక్కువ తక్కువలు లేకుండ కపటోద్దేశములతో చరించుచుందురు. ఇహలోకము చాల హీన ప్రవర్తనములతో నిండియుండును. కలహములచేత మిగుల ఘోరకార్యములు చేయుచుందురు.


వివిధ వృత్తులు చేయువారలకును అవాంతరములు కలిగి కష్టనష్టముల పాలగుచుందురు. పుణ్యబలము లేకపోవుటచే లోకమంతయు నడుగంటిపోవును. కూడని పనులచేతను, కుచ్చితముల చేతను, రోగములతోను, ఆయుధములతోను నశింతురు. ఆడిన మాటలు తప్పి నడచుచుందురు. లేనివానిని ఉన్నట్లును, ఉన్నవానిని లేనట్లును చెప్పుచుందురు. తాతతండ్రుల నాటి ఇండ్లు పొలములు వదిలి పెట్టి దేశదేశాలకు పోదురు.


క్రొత్తగా మంత్రములు నేర్చుకొని టక్కరి వృత్తులచే జనులను మోసగించుచు నశించుచుందురు. కామోద్రేకులై అల్పాయుష్యముతో నశించుచుందురు.


స్త్రీలకు ఆయుష్యము పెంపగును. ఊరనున్నను, అడవినున్నను, సముద్రముపై నున్నను మానవులకు చావులు తప్పవు. ఉల్కాపాతములు, పెద్ద పెద్ద రాళ్ళు కొండలనుండి పగిలి పడుటయు, సర్పములు గ్రామములలో తిరిగి కరచు చుండుటయు, దేవతా పంపులు వింతలుగ జనుల హతమార్చుచుందురు.


సూర్యుడు దక్షిణ రేఖాగతుడై జనుల మారణము చేయుచుండును. యమునితో పనిలేదు. ధూమకేతువులు పుట్టుచుండును. సూర్యచంద్రులకు కళలు తగ్గును. దేవతలు, మునులు, నియమము తప్పని కులజులు నిందల పాలగుదురు. శాంతము సాత్వికము లేక జనులెల్ల చచ్చుచుందురు. కొండలు కృంగి పోవును. వృక్షములు ఘోరముగ పడిపోవును. పశువులు మృగములు మానవ భాషతొ మాట్లాడును. అగ్ని కణములు వర్షించును. అబధ్ధములకు అంతులేక యుండును.


విపరీతమైన చావులు కలుగును. అనేక విధములగు వింతలు కలుగును. వీరులు వ్యర్ధ కార్యము చేయుదురు. కవులు సత్కవితలను మాని దుష్టములైన వ్రాతలు వ్రాయుచుందురు. ప్రతి ఇంట విగ్రహ పూజలు కలుగును. మానవులెన్నియో తప్పుడు కార్యములు చేయుచుందురు. మతములెన్నెన్నియో కలిగి మాయవాదులై ప్రజలను మోసగించి హితవు తప్పి కామాది వికారములు బొంది గురుభక్తి యనునది లేశమైనను లేక దు:ఖముల పాలై పెద్ద పెద్ద నామములు పెట్టి వైష్ణవుల మనుచు నరక హేతువులైన పనులు చేయుచు నశించుచుందురు.


దేవతలు మహర్షులు మునిగణములు యక్ష మరుద్గణాదులు బిలములలో నుందురే కాని వెలుపలకు రారు. బీదనరు లలమటించుచున్నను దేవతలుకూడ రక్షించుటకై రారు. పొరపాటునైన ఒక్కరు కనిపించరు. దేవతల వరములన్నియు నడుగంటును. సత్యమెచ్చటకు పోవునో లోకములో కానరాదు. పుష్పములకు వాసన యేమాత్రము లేకపోవును. జనులు మగ్గిపోవుట అధికమగును. అంటరానిజాతు లగ్రజాతు లగుదురు.


ఆదికులములకెల్ల హాని సంభవించును. ఇంటింట దు:ఖములేయుండును. వెయ్యి ఇండ్లకు ఒక్క ఇల్లగును. పతివ్రతలు కులటనకత్తెలగుదురు. పక్షులు రాత్రిళ్ళు కూయును. ఆకాశము ఎఱుపు రంగుతో యుండును. స్నేహితు లొకరికొకరు విరోధులగుదురు.


అన్ని దిక్కులను అల్లరి ధ్వనులు వినబడును. ప్రతి మానవ హృదయము దిగులుతో నుండును. ఏవైపు చూచినను భయంకర ధ్వనులు భయంకర దృశ్యములు వుండును. సత్కుల మర్యాద లణగిపోవును. అట్టివారికి నిలువనీడ దొరకకుండును. సూర్యునియొద్ద తప్ప నిలువ నీడ యెవరికి దొరకకుండును. సానగాది మహర్షుల వంశములు దినము ఒక్క సంవత్సరముగ గడుపవలసి యుండును. బ్రహ్మత్వహీనముతో బ్రతుక వలసి వచ్చును. అతి దీన వృత్తితో జీవించుట యగును.


నదీనదంబుల నీరు ఇంకును. దేవతలు వరములీయరు. దుష్టభూతములు ధరణిపై సంచరించుచుండును. పుణ్యాత్ములు కష్టము లనుభవించుచు జీవించ వలసి యుండును. రోగము లనేక విధములుగా వృధ్ధియగును. క్రోధములు పెచ్చు పెరిగి జగడములు పెంచుకొని మరణించుచుందురు. ఆయుష్యములు తగ్గును. చావులు విశేషమగును. మేఘములు గొప్పగా కురియుచుండును. ఏనుగులు సైతము దిగబడు నంతటి బురదయగును.


పాలునీళ్ళు సమానమగును. అనగా పాలలో శక్తి లేకుండును. నాస్తికమతము, క్రూరకార్యములు, చెడ్డ బోధలు నిండియుండును. మలమూత్రభోజనఖలు లగుదురు. భూమి బ్రద్దలైపోవును. యమకింకరులు దక్క మనుజు లుండరు. రాత్రి పగలుగను, పగలు రాత్రిగను మార్పు చెందుచుండును. పగటివేళ నక్కలు అధికముగా కూయుచుండును. దుష్టజంతువు లధికముగా కనుపించుచుండును.


జ్ఞానులు సైతము మాయకు లోబడి శరీర సుఖాపేక్షతో నుందురేకాని ఆ సుఖమును పొందజాలరు. అట్టివారలకు భగవంతుడే దిక్కు.
నివేదన
ఈ గ్రంథంలో మీకు ఏదైనా బాగుందనిపిస్తే అది నా గురుదేవుల అనుగ్రహం. తక్కిన దోషాలన్నీ నావి. చేతగానితనమంతా నాది.

పావులూరి శ్రీనివాసాచారి
(పాంచజన్య విశ్వకర్మ)


సశేషం© All Rights Reserved         Last Updated::